తిరుపతిని ముంచెత్తిన గల్లా ఫెక్సీలు
posted on Mar 24, 2012 3:18PM
తిరుపతి పట్టణాన్ని హఠాత్తుగా గల్లా జయదేవ్ ఫ్లెక్సీలు ముంచెత్తాయి. రాష్ట్ర మంత్రి గల్లా అరుణ కుమారి కుమారుడైన గల్లా జయదేవ్ తిరుపతి అసెంబ్లీకి జరగబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయన తిరుపతి పట్టణంలో తన ఫొటోలతో ఉన్న వందలాది ఫ్లెక్లీలను ఏర్పాటు చేశారు. అధిష్టానం ఆదేశిస్తే తాను ఇక్కడ నుంచి పోటీ చేయడానికి సిద్దమేనని ఆయన బహిరంగంగా ఇప్పటికే ప్రకటించారు. గల్లా అరుణ కుమారి కూడా తన కుమారుడికి టిక్కెట్ ఇప్పించుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కరుణాకర్ రెడ్డిని ఢీకొట్టాలంటే అర్ధ బలం, అంగ బలం ఉన్న తన కుమారుడికే సాధ్యమని ఆమె అంటున్నారు. ఈ టిక్కెట్ విషయమై ఆమె ఇప్పటికే చిరంజీవితో కూడా మంతనాలు జరిపినట్లు తెలిసింది. ఒకవేళ అధిష్టానం చిరంజీవి అభిప్రాయాన్ని కోరితే ఆయన జయదేవ్ పేరు చెప్పే అవకాశం ఉందని తెలిసింది. తిరుపతి కాంగ్రెస్ టిక్కెట్ ను మాజీ ఎం.ఎల్.ఎ. వెంకటరమణ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి తనకు టికెట్టు ఇవ్వవలసిందిగా అభ్యర్ధించారు. అయితే గల్లా జయదేవ్ ఫ్లెక్సీలను వెంకటరమణ ఇంటివద్ద కూడా పెట్టడంతో ఆయన ఆందోళనకు గురవుతున్నారు. ఒకవేళ గల్లా జయదేవ్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్టు కేటాయిస్తే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కరుణాకర్ రెడ్డి గట్టిపోటీనే ఎదుర్కోవాల్సి వస్తుంది.